కత్తిపట్టి కొండలెక్కిన విశాఖ జిల్లా పోలీస్ బాస్…
(రాజన్ – జనహృదయం ప్రతినిధి)
గంజాయి రవాణా, సాగు అధికంగా జరుగుతున్న విశాఖ ఏజన్సీ మావోయిస్టుల కార్యకలాపాలకు అడ్డాగా నిలువడంతో ఇంతకాలం గంజాయిసాగుపై కాస్త చూసిచూడనట్టు వ్యవహరించిన పొలీసులు ఇకపై ఉక్కుపాదం మోపేందుకు సిద్దమయ్యారు. ఏకంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారే స్వయంగా రంగంలోకి దిగి తన చేత కత్తి పట్టి గంజాయిసాగును నిర్మూలించేందుకు ఏజన్సీ కొండలు జల్లెడ పడుతున్నారు. దీంతో విశాఖ పోలీస్ ప్రశంసలు అందుకొంటోంది.
గంజాయి రవాణాఅరికట్టేందకు పోలీసు, ఎక్సైజు అధికారులు రాత్రింబవళ్లు కాపాలా కాసి ఎన్ని వాహనాలు సీజ్ చేసినా, ఎంతమందిని కటకటాలకు పంపినా విశాఖ ఏజన్సీ కేంద్రంగా గంజాయి రవాణా నిత్యం సాగుతూనే ఉంది. కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తూ స్మగ్లర్లు తమ పని చేసుకుపోతున్నారు. అయితే ఈ అక్రమ రవాణాలో సామాన్యులే అధికంగా బలైపోతూ బడా వ్యాపారులు చిక్కకుండా తమ చీకటి వ్యాపారాన్ని విస్తరిస్తూనే ఉన్నారనేందుకు నిత్యం ఈ ప్రాంతంతో పాటు తెలంగాణా, ఒరిస్సా రాష్ట్రాలలో పోలీసులకు చిక్కుతున్న వారు ఇచ్చిన సమాచారం ప్రకారం విశాఖ ఏజన్సీ గంజాయి రవాణా, సాగుకు అనుకూలంగా నిలుస్తోందని గ్రహించిన పోలీసు ఉన్నతాధికారులు రవాణాతో పాటుగా గంజాయి సాగును నిర్మూలించాలని భాయించారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా పోలీసు ఉన్నతాధికారి కృష్ణారావు స్వయంగా ఏజన్సీ కొండలెక్కి గంజాయి సాగు ద్వంసం చేస్తూ సాగుచేస్తే చర్యలు తప్పవన్న సంకేతాలిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
ఇంతకాలం గంజాయి రవాణా అరికట్టడంపై నిఘా ఉంచి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన అధికారులు మావోయిస్టు కార్యకలాపాలను అరికట్టడంలో సఫలీకృతులై గతంలో గంజాయి సాగుపై దృష్టిపెట్టలేని మారుమూల కొండప్రాంతాలను సైతం జల్లెడ పడుతూ గతంలో మావోయస్టులకోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసు యంత్రాంగం విశాఖ ఏజన్సీలో గంజాయిసాగు నిర్మూలనకోసం కృషిచేయడం అభినందనీయం. ఓవైపు గంజాయిసాగు, మరోవైపు రవాణా అరికట్టడంపై దృష్టిపెట్టడంతో విశాఖ ఏజన్సీలో గంజాయి అక్రమవ్యాపారం తగ్గుముఖం పట్టే అవకాశం మెండుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జి.మాడుగుల మండలం మారుమూల పంచాయతీలు చీకుంబంద, పాలమామిడి, ఏడుచావళ్లు ప్రాంతాల్లో కొండలు కలియతిరిగి గంజాయిసాగును ద్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కృష్ఠారావుతోపాటు, ఓఎస్‌డి సతీష్ కుమార్ పోలీసు అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గంజాయి రవాణాతో పాటు సాగుచేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Comments
Post a Comment