దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా సెకండ్ వేవ్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తూ తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. రోజుకి రెండు లక్షలకు పైగా కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం తీవ్ర భయోత్పాతం సృష్టిస్తోంది. ఈ నెల మొదటి వారంలో కేవలం 8 శాతంగా ఉన్న కరోనా పాజిటివ్ రేటు రెట్టింపైంది. పాజిటివిటీ రేటు 16 శాతం దాటిపోయింది. వారాంతం లెక్కల ప్రకారం 3 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 13 శాతానికి పెరిగింది. మరోవైపు భారీగా పెరుగుతున్న కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భయాందోళనకు గురిచేస్తోంది. శనివారం ఒక్కరోజే 1500 మందికి పైగా కరోనాతో మృత్యువాతపడ్డారు.
కరోనా ప్రారంభంలో లాక్ డౌన్ విధించి కట్టడికి యత్నించిన కేంద్రం.. ఈసారి ఆ బాధ్యతలను రాష్ట్రాలకే అప్పగించినట్లు తెలుస్తోంది. కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ, కరోనా కరాళ నృత్యం చేస్తున్న మహారాష్ట్ర, రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సహా పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో మరో రెండు రాష్ట్రాలు వచ్చి చేరాయి. తమిళనాడు, బీహార్ ప్రభుత్వాలు కరోనా ఆంక్షలు విధించాయి. దీంతో దేశంలో క్రమక్రమంగా అప్రకటిత లాక్‌డౌన్ అమలవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడులో .... ఈ నెల 20 వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని పళనిస్వామి ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఆ సమయంలో కేవలం నిత్యావసరాల సరఫరా వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. పబ్లిక్, ప్రైవేటు వాహనాలను అనుమతించరు. హెల్త్ కేర్ వాహనాలు, న్యూస్ పేపర్, పాలు వంటి ఇతర అత్యవసర సర్వీసుల వాహనాలను అనుమతిస్తారు. అలాగే తమిళనాడులో ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన ఊటీ, కొడైకెనాల్‌కు పర్యాటకులను అనుమతించరని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కామర్స్, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీపైనా ఆంక్షలు విధించింది.
బిహార్‌లో ...... నితీష్ ప్రభుత్వం కరోనా కట్టడికి కఠిన చర్యలకు ఉపక్రమించింది. రాత్రి కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. ఆ సమయంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఆదేశించింది. రాష్ట్రమంతా నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుందని పేర్కొంది. అలాగే వచ్చే నెల 15 వరకూ విద్యాసంస్థలు మూసివేసి ఉంటాయని.. పరీక్షలు కూడా జరగవని చెప్పింది. నిత్యావసర వస్తువుల దుకాణాలు సాయంత్రం 6 గంటల వరకూ నడుపుకోవచ్చని.. హోటళ్లు, దాబాలు 9 గంటల వరకూ ఉంటాయని తెలిపింది. అయితే పార్శిల్ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ప్రార్థనా మందిరాలు మూసివేయనున్నట్లు ప్రకటించింది. కోవిడ్ నిబంధనలు పాటించి కరోనా కట్టడిలో ప్రజలు భాగస్వాములు కావాలని సీఎం నితీష్ కోరారు.
Comments
Post a Comment