నగదు కొరతతో చెల్లింపులకు అవస్థలు......
(పీవీ సత్యనారాయణ రావు)
* పధకం ప్రకటించిన వెంటనే బ్యాంకులకు పరుగులు* బ్యాంకులకు పోటెత్తుతున్న లబ్దిదారులు
* నగదు సర్దుబాటు చేయలేక బ్యాంకు అధికారుల అగచాట్లు
నర్సీపట్నం.
జగనన్న అమ్మ ఒడి........
వైఎస్సార్ రైతుభరోసా........
జగనన్న చేయూత.......
వైఎస్సార్ ఆసారా.....
జగనన్న సున్నావడ్డీ......
ఇలా పధకం ఏదైనా లబ్దిదారులైన ప్రజలకు నగదు పంపిణీ ఓక్కటే ప్రభుత్వ లక్ష్యం గా మారింది. అయితే పధకం ప్రారంభించిన మరునాడే లబ్దిదారులు డబ్బు కోసం బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. దాంతో ఖాతాదారులకు అవసరమైన నగదు చెల్లింపుల కోసం బ్యాంకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు.
బ్యాంకుల అవసరాలకు తగ్గట్టుగా నగదు సరఫరా చేయడానికి రిజర్వ్ బ్యాంకు గత కోంత కాలంగా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఏటీఎంలలో అవసరమైన నగదును సర్దుబాటు చేయలేక ఇబ్బంది పడుతున్న జాతీయ బ్యాంకులకు జగనన్న పథకాలు మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతున్నాయి.
ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందే కుటుంబాలలో కేవలం మహిళల బ్యాంకు ఖాతాలకు మాత్రమే సదరు సొమ్మును ప్రభుత్వం జమ చేస్తున్నది .గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన డ్వాక్రా సంఘాల పథకంలో సభ్యులైన వందలాది మంది మహిళల ఖాతా లకు ప్రభుత్వం జమ చేస్తున్న అమ్మ ఒడి, జగనన్న తోడు, తదితర పథకాల సొమ్మును లబ్ధిదారులు అయిన మహిళలు వెనువెంటనే విత్ డ్రా చేసేందుకు బ్యాంకులపై దండెత్తుతున్నారు.
దాంతో ఖాతాదారులైన మహిళలకు చెల్లించాల్సిన నగదును సర్దుబాటు చేసేందుకు బ్యాంకుల అధికారులు నానా అగచాట్లు పడుతున్నారు. గ్రామీణ జిల్లాలో ముఖ్యపట్టణమైన నర్సీపట్నం లోని వివిధ బ్యాంకులకు నగదు లభ్యత ప్రధాన సమస్యగా మారింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు లక్షలాది రూపాయలను ప్రభుత్వ సంక్షేమ లబ్దిదారులైన ఖాతాదారులకు చెల్లించేందుకు తగినంత నగదు లేక వివిధ జాతీయ బ్యాంకులు ఇబ్బందులు పడుతున్నాయి.
ప్రధాన నగరాలకు కేటాయిస్తున్న రీతిలో నర్సీపట్నం వంటి పట్టణాలకు అవసరమైనంత నగదు కేటాయింపులను రిజర్వ్ బ్యాంక్ జరపకపోవడంతో ఈ ప్రాంతంలోని అనేక జాతీయ బ్యాంకులు తీవ్రమైన నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి.
ఈ నేపధ్యంలో డబ్బు విత్ డ్రా కోసం వందలాదిగా తరలివస్తున్న మహిళలను అదుపు చేయలేక, కరోనా నిబంధనలను అమలు చేయలేక బ్యాంకు అధికారులు తంటాలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి తరలివచ్చే వందలాది మహిళలు కూడా నిలువ నీడ లేక, బ్యాంకుల వెలుపలే వేచి ఉంటున్నారు.
Comments
Post a Comment