రెవెన్యూ సిబ్బంది అవకతవకలపై అధికారుల నిర్లిప్తత
(పీవీ.సత్యనారాయణ రావు)
* నిందితుల సహకారంతోనే తప్పించుకుంటున్న బాధ్యులు
* రాజకీయ ఒత్తిళ్లతో ఫిర్యాదులు బుట్టదాఖలు
* స్పందన దరఖాస్తులపై చర్యలు శూన్యం
నర్సీపట్నం: ప్రభుత్వంలోని మిగతా శాఖలపై పెత్తనం చెలాయించే రెవెన్యూ శాఖలోనే అవినీతి అవకతవకలు జోరుగా సాగుతున్నాయి. దిగువ స్థాయి రెవెన్యూ ఉద్యోగుల అవకతవకలపై నిర్దిష్ట ఫిర్యాదులు అందుతున్నా, పత్రికల్లో వార్తా కథనాలు వెలువడుతున్నా సంబంధిత అధికారులు తమకేందుకులే అనే ధోరణితో నిర్లిప్త వైఖరిని అవలంబిస్తున్నారు.
స్పందన ఫిర్యాదులపై చర్యలు శూన్యం
ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో మండల, డివిజన్ ,జిల్లా స్థాయిల్లో ప్రజలు అందజేస్తున్న ఫిర్యాదులు విజ్ఞప్తులలో అత్యధిక శాతం రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉంటున్నవి. అధికారులు మారినప్పుడల్లా బాధిత ప్రజలు మరొకసారి వచ్చి అందజేస్తున్న ఫిర్యాదుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది.అంతేకాకుండా ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక శాతం రెవెన్యూ శాఖకు చెందిన వారే ఉంటున్నారు .అదేవిధంగా దిగువ స్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది రాజకీయ అండదండలతో జరుపుతున్న అవకతవకలకు సంబంధించి పత్రికల్లో కథనాలు వెలువడుతున్నా అధికారులు నిర్లిప్త ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. స్పందన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యలు బాధిత ప్రజలకు తెలియక పోవడం గమనార్హం. కనీసం వాటికి సంబంధించిన గణాంక వివరాలు చెప్పేందుకు కూడా రెవెన్యూ అధికారులు ఆసక్తి చూపటం లేదు.
రెవెన్యూలో అక్రమాల రూటే సెప"రేటు"
విశాఖ సిటీ పరిధిలో భూ ఆక్రమణ లతోపాటు గ్రామీణ జిల్లాలోని అనేక మండలాల్లో భూములు ఆక్రమణ, రెవెన్యూ రికార్డులను తారుమారు చేయటం, బోగస్ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారీ, వెబ్ ల్యాండ్ లో భూముల సర్వే నెంబర్లు యజమానుల పేర్లు తారుమారు చేయటం వంటి అనేక అవకతవకలు యధేచ్చగా జరుగుతున్నాయి. గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాల ద్వారా హక్కు పత్రాల కోసం దరఖాస్తులు చేస్తున్నా రెవెన్యూ సిబ్బంది చేతులు తడపందే పనులు జరగడం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు జరిపిన భూసేకరణలో అనేక అవకతవకలు జరిగినప్పటికీ, ప్రభుత్వ పధకాల అమల్లో జాప్యం జరగకూడదనే ఉద్దేశ్యంతో రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. జిల్లా లోని పలు ప్రాంతాల్లో జరిపిన భూసేకరణ ప్రక్రియలో లక్షల రూపాయలు చేతులు మారాయి. రెవెన్యూ ఉద్యోగులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతో భూసేకరణ ప్రక్రియ సాఫీగా సాగిపోతున్నది.
మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ పై కొంతమంది స్పందన కార్యక్రమం ద్వారా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని అంటున్నారు.
ప్రతి మండలంలోనూ ఇదే తంతు ...
గ్రామీణ జిల్లాలో దాదాపు ప్రతి మండలంలో రెవెన్యూ శాఖ పరంగా అనేక అవకతవకలు జరుగుతున్నాయి. రైతుల భూముల వివరాలు సాగుబడి ,యాజమాన్య హక్కులు, విస్తీర్ణం వంటి అంశాలను పొందుపరిచి ప్రభుత్వం రూపొందించిన వెబ్ లాండ్ రెవెన్యూ శాఖకు ఆదాయ వనరుగా మారింది. ఇందులో మార్పులు చేర్పులు చేసే అధికారం గతంలో మండల స్థాయి అధికారులకు ఉండటంతో వారికి కావాల్సిన రీతిలో గణాంకాలను మార్పు చేసేశారు. గోలుగోండ మండలానికి చెందిన అధికార పార్టీ నాయకుడి తనయుడు బోగస్ పట్టాదారు పాసు పుస్తకాలతో జాతీయ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుని ప్రభుత్వాన్ని మోసం చేసిన వైనం సదరు బ్యాంకు అధికారులు గుర్తిస్తే తప్ప వెలుగులోకి రాకపోవడం గమనార్హం.
అంతేకాకుండా బ్యాంకు అధికారుల కోరిన మేరకు రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నారే తప్పా, బోగస్ పట్టాదార్ పాస్ పుస్తకాలు ఏ విధంగా తయారు అయ్యాయి అనే అంశాన్ని పట్టించుకోక పోవడం గమనార్హం. ఈ కుంభకోణం వెనుక గొలుగొండ మండలం లో గతంలో పనిచేసిన కొంతమంది రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల ప్రమేయం ఉండటంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు స్వయంగా రెవెన్యూ అధికారులే ప్రయత్నిస్తుండటం గమనార్హం.
ఇదే రీతిలో పాయకరావుపేట మండలం లో కొద్ది సంవత్సరాల క్రితం బోగస్ పట్టాదారు పాసు పుస్తకాల ద్వారా కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు తీసుకొని స్వాహా చేసిన ఉదంతాన్ని అప్పట్లో పనిచేసిన ఒక రెవెన్యూ ఉన్నతాధికారి కప్పి పుచ్చటం జరిగింది. అంతేకాకుండా మాకవరపాలెం మండలం లో కూడా బోగస్ పాస్ పుస్తకాలు వ్యవహారంపై సీబీసీఐడీ అధికారులు సమగ్ర విచారణ జరిపినా, బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కొంతమంది రెవెన్యూ అధికారులు వారి మనుగడ కాపాడుకునేందుకు దిగువ స్థాయి రెవెన్యూ సిబ్బందిని కుంభకోణాలకు బాధ్యులుగా చేసి బలిపశువులను చేయడం తరచుగా జరుగుతుంది.
సిట్ దృష్టి పెట్టని గ్రామీణ జిల్లా....
విశాఖ సిటీ భూ కుంభకోణాలపై రెండు పర్యాయాలు ఏర్పాటుచేసిన సిట్ బృందాలు రూపొందించిన దర్యాప్తు నివేదికలు నేటికీ పూర్తి స్థాయిలో వెలుగు చూడలేదు. అదే తరుణంలో సిట్ అధికారులకు గ్రామీణ జిల్లా పరిధిలోని ఎలమంచిలి, నక్కపల్లి ,పాయకరావుపేట, రోలుగుంట, నాతవరం, మాకవరపాలెం రావికమతం తదితర మండలాల్లో జరిగిన భూ కుంభకోణాలపై నిర్దిష్ట ఫిర్యాదులు అందినప్పటికీ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు వాటి వైపు నేటికీ కన్నెత్తి చూడలేదు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని యధేచ్చగా అనుభవిస్తున్న వారు ఎందరో ఉండగా, తమ సొంత భూములపై రెవెన్యూ రికార్డులలో హక్కు కల్పించమంటూ అధికారులు, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు కూడా అంతే సంఖ్యలో ఉంటున్నారు.
కొన్ని ప్రాంతాల్లో అవకతవకలకు పాల్పడే రెవెన్యూ ఉద్యోగులు, అధికారులు ఎటువంటి క్రమశిక్షణా చర్యలకు గురికాకుండా రాజకీయ అండదండలతో అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటువంటి రెవెన్యూ ఉద్యోగులకు అధికార పార్టీ నాయకులు ఏరి కోరి వారి ప్రాంతాల్లో పోస్టింగులు ఇప్పిస్తున్నారు. దాంతో ఎన్ని అక్రమాలకు పాల్పడిన నాయకులే తమకు అండగా నిలుస్తారన్న ధీమాతో, రెవెన్యూ శాఖ పనితీరు అవినీతిలో అగ్రస్థానం నిలబెట్టుకునేలా కొనసాగుతుంది.
Comments
Post a Comment