భారత్ సహనాన్నిపరీక్షించాలనుకుంటే దీటుగా స్పందిస్తాం ప్రధాని మోడీ
రాజస్తాన్: దేశ రక్షణ కై సరిహద్దుల్లో పహారా కాస్తున్న జవాన్లతో ప్రధాని నరేంద్రమోదీ దీపావళి పండగ జరుపుకొన్నారు. శనివారం రాజస్థాన్‌లోని జైసల్మేర్ లోంగేవాలా పోస్ట్‌లో సరిహద్దు జవాన్లను కలిసి ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపి స్వీట్స్ పంచారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఆక్రమణలకు పాల్పడుతున్న పొరుగుదేశాలైన పాకిస్థాన్, చైనాకు మోదీ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. యావత్ ప్రపంచం విస్తరణవాద శక్తులతో సమస్య ఎదుర్కొంటోంది. విస్తరణవాదం అనేది ఒక మానసిక వ్యాధి. వారింకా 18వ శతాబ్దపు భావజాలంతోనే ఉన్నారు. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విస్తరణ వాదాన్ని ఎదుర్కోవడంలో భారత వ్యూహం స్పష్టంగా ఉంది. ఇతరుల అభిప్రాయాలు, విధానాలను భారత్ గౌరవిస్తుంది. అయితే మనల్ని పరీక్షిస్తే మాత్రం దీటైన జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు భారత్ శత్రుదేశంలోకి ప్రవేశించి ఉగ్రవాదులను, వారి నాయకులను హతమార్చింది. దేశ సమగ్రత, ప్రయోజనాలపై భారత్ ఎన్నడూ రాజీపడదు. ఈ విషయం ప్రపంచానికి కూడా అర్థమైంది’ అని మోదీ చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై భారత్ ఇంతటి గౌరవాన్ని పొందిందంటే అదంతా సైనికుల పరాక్రమాల వల్లే అని ప్రధాని జవాన్లనుకొనియాడారు.
మీతో కలవడమే నాకు పండగ...
‘ప్రతి భారతీయుడి దీపావళి శుభాకాంక్షలను నేను తీసుకొచ్చాను. మీరు(జవాన్లు) మంచు పర్వతాల్లో ఉన్నా.. ఎడారుల్లో ఉన్నా మిమ్మల్ని కలిస్తేనే నా దీపావళి పరిపూర్ణమవుతుంది. మీ ముఖంపై చిరునవ్వులు చూస్తే నా ఆనందం రెట్టింపవుతుంది’ అని మోదీ తన సంతోషాన్ని వెలిబుచ్చారు. భారత జవాన్ల శౌర్యపరాక్రమాలు అసమానమని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. దేశ సరిహద్దులను కాపాడే క్రమంలో ప్రపంచంలోని ఏ శక్తి మన సైనికులను అడ్డుకోలేదంటూ పరోక్షంగా చైనా, పాకిస్థాన్‌లను హెచ్చరించారు. త్రివిధ దళాలు పరస్పరం సహకరించుకుంటూ శత్రుమూకలపై విజయం సాధిస్తున్నాయని ప్రశంసించారు. ఇందుకు 1971లో పాక్‌తో జరిగిన యుద్ధమే ఉత్తమ ఉదాహరణ అని మోదీ పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం పాటుపడుతున్న జవాన్లకు 130 కోట్ల మంది భారతీయులు అండగా ఉన్నారని మోదీ తెలిపారు. సైనికుల ధైర్యసాహసాలు, పరాక్రమాలకు ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారన్నారు. ఈ సందర్భంగా లోంగేవాలా యుద్ధాన్ని గుర్తుచేసుకున్నారు. జవాన్ల పరాక్రమాలను మాట్లాడుకున్న ప్రతిసారీ లోంగేవాలా యుద్ధం గుర్తొస్తుందని చెప్పారు. ‘మీతో ఎంత ఎక్కువ సమయం గడిపితే.. అంత ఎక్కువగా ఈ దేశానికి సేవ చేయాలనే నా కాంక్ష మరింత బలపడుతుంది’ అని మోదీ జవాన్లతో అన్నారు.
Comments
Post a Comment