భారత ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. అమెరికా కోరిక మేరకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఎగుమతిపై ఆంక్షలు తొలగించి.. ఆ దేశానికి సరఫరా చేసినందుకు ట్విటర్ ద్వారా ఆయన థ్యాంక్స్ చెప్పారు. ప్రపంచమంతా కరోనాపై పోరాడుతున్న తరుణంలో మోదీ బలమైన నాయకత్వం మొత్తం మానవాళికే అండగా నిలబడుతోందని ట్రంప్ ప్రశంసించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు.
హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై నిర్ణయం తీసుకున్న భారత్‌కు, భారత ప్రజలకు కృతజ్ఞతలు. భారత్ సాయాన్ని ఎప్పటికీ మరచిపోం. నరేంద్ర మోదీ బలమైన నాయకత్వం కరోనా పోరులో.. కేవలం భారత్‌కే కాదు, మొత్తం మానవాళికి అండగా నిలబడుతోంది. అసాధారణ పరిస్థితుల్లో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరం’ అని ట్రంప్ ట్వీట్ చేశారు.
దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ట్రంప్‌తో ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘విపత్కర పరిస్థితులే మిత్రులను మరింత దగ్గర చేస్తాయి. భారత్ - అమెరికా సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా మరింత బలపడుతున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి భారత్ చేయగలినంతా చేస్తుందని తెలిపారు. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటూ విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు.
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కరోనా బారినపడి అమెరికాలో దాదాపు 15 వేల మంది మరణించారు. వైరస్ బాధితుల సంఖ్య 4.35 లక్షలు దాటింది. మృతుల్లో 11 మంది భారత సంతతికి చెందిన వారున్నారు. మరో 16 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. అమెరికాలో కరోనా కారణంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక శాతం న్యూయార్క్‌లోనే నమోదవుతున్నాయి. ఇక్కడ దాదాపు 6 వేల మంది మృతి చెందారు.
కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనే చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మహమ్మారి నివారణకు ఇప్పటివరకు ప్రత్యేక మందు లేని కారణంగా.. మలేరియా నివారణకు ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్ డ్రగ్‌ను వినియోగిస్తున్నారు. అమెరికాలో ఈ మందుకు విపరీత డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌ను ఎగుమతి చేయాల్సిందిగా కోరింది. యూఎస్, యూకేతో పాటు పలు దేశాలకు భారత్ ఈ ఔషధాన్ని ఎగుమతి చేసింది.
Comments
Post a Comment