ప్రశంసలు పొందుతున్న జివిఎంసి కమిషనర్ సృజన
విశాఖపట్నం : కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌తో జనాలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కానీ ఆ మహమ్మారిని కట్టడి చేసే పనిలో అధికారులు, పోలీసులు బిజీ అయ్యారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రింబవళ్లు విధుల్లో ఉంటున్నారు. జివిఎంసి కమీషనర్ సృజన కూడా ఇలాంటి క్లిష్టమైన సమయంలో తన అంకితభావాన్ని చాటుకున్నారు. విశాఖలో ఉండే 30 లక్షలమందికిపైగా ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు. తన నెల రోజుల పసికందుతో విధులకు హాజరవుతున్నారు. ప్రతిరోజు అధికారులు, సిబ్బందితో సమీక్ష చేస్తున్నామన్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. కమిషనర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వాస్తవానికి సృజన నెల రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన ఆమె.. సెలవుల్ని వదిలేశారు. ప్రజలో కోసం, కరోనా నివారణ కోసం విధుల్లో చేరారు. మొదటి మూడు వారాలు సృజన తన బిడ్డను ఇంట్లోనే వదిలేసి ఆఫీసుకు వచ్చారు. పిల్లవాడి బాగోగుల్ని భర్త, తల్లికి వదిలేశారు. ఆమె మద్య, మధ్యలో బిడ్డను చూడటానికి వెళ్లొచ్చేవారు. విశాఖ ప్రజల కోసం కష్టపడుతున్నారు. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
కరోనాతో విశాఖవాసులు ఆందోళనలో ఉన్నారని.. వారిలో ధైర్యం నింపాల్సిన బాధ్యతపై తమపై ఉందంటున్నారు సృజన. అందుకే తాను ఈ కష్ట సమయంలో అండగా ఉండాలని విధులకు వస్తున్నాను అంటున్నారు. ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని.. ఇళ్లలో నుంచి బయటకు రావొద్దంటున్నారు. ప్రజలకు నిత్యావసరాల కొరత రానివ్వమని.. కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Post a Comment