కరోనా రాకుండా ఇవి పాటించండి
చైనాలో విజృంభిస్తున్న కరోనావైరస్ ఎందుకంత ప్రమాదకరం? కరోనా వైరస్‌లు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?
చైనాలో వ్యాపిస్తున్న కొత్త వైరస్ కరోనా వైరస్‌ల కుటుంబానికి చెందినది. గతంలో ఈ వైరస్‌లు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్), మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్(మెర్స్) అనే శ్వాసకోస వ్యాధులకు కారణమయ్యాయి. అప్పట్లో సార్స్ బాధితుల్లో 9 శాతం మంది, మెర్స్ బాధితుల్లో ఇంచుమించు 35 శాతం మంది చనిపోయారు.
కొన్ని అరుదైన సందర్భాల్లో మనిషి వ్యాధి నిరోధక వ్యవస్థ బాగా బలహీనపడినప్పుడు లేదా మరేదైనా ముఖ్యమైన కారణంవల్ల ఇతర జీవుల నుంచి మనుషులకు వైరస్ వ్యాపించవచ్చని ఆయన తెలిపారు.
చాలా వరకు వైరస్‌లో జన్యుపరివర్తన వల్లే ఈ ప్రమాదం ఏర్పడవచ్చు. మరో జీవజాతిలో ఎదిగేందుకు వీలుగా వైరస్ తనను తాను మార్చుకొన్నప్పుడు సమస్య తీవ్రత పెరుగుతుందని ప్రొఫెసర్ ఈస్టన్ చెప్పారు.
ఇలాంటి పరిస్థితుల్లో కరోనావైరస్ మనుషులకు వ్యాపిస్తే సమస్య చాలా ఆందోళనకరంగా మారుతుంది.
అన్నీ హానికరం కాదు
అన్ని కరోనావైరస్‌లూ మరీ అంత ప్రమాదకరం కావు. అయితే మరో జీవజాతి నుంచి సంక్రమించే వైరస్‌లు చాలా హానికరంగా మారవచ్చు.
ఏదైనా వైరస్ ఇతర ప్రాణుల నుంచి కొత్తగా మనుషులకు సంక్రమిస్తే, దాని ప్రభావం ఎలా ఉంటుందనేది అంచనా వేయలేమని ప్రొఫెసర్ ఈస్టన్ తెలిపారు. ఏదైనా కరోనావైరస్ జంతువుల నుంచి హఠాత్తుగా మనకు వ్యాప్తిస్తే అప్పటివరకు దానిపై పోరాడిన అనుభవం మన రోగనిరోధక వ్యవస్థకు లేకపోవడం వల్ల మనపై దాని ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని వివరించారు.
ఇన్‌ఫ్లుయెంజా కారక వైరస్‌లు ఇతర జాతుల నుంచి మనిషికి వ్యాపించినప్పుడు కూడా ఇలాంటి సమస్యే ఉంటుంది.
1918-19ల్లో వ్యాపించిన ఇన్‌ఫ్లుయెంజాను చరిత్రలో అత్యంత తీవ్రమైన ఇన్‌ఫ్లుయెంజాగా భావిస్తారు. అప్పట్లో పక్షుల నుంచి సంక్రమించిన వైరస్ దాదాపు ఐదు కోట్ల మంది ప్రాణాలు తీసింది.
ప్రస్తుత కరోనావైరస్ అంత ప్రాణాంతకమైనదనే సూచనలేవీ లేవు. అయితే గతంలో జంతువుల నుంచి మనుషులకు వ్యాపించిన వైరస్‌లు చూపిన పెను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు దీని విజృంభణపై వైద్య రంగం తీవ్రంగా ఆందోళన చెందుతోంది.
కరోనావైరస్‌లాంటి వైరస్‌లలో జన్యు పరివర్తన ఎక్కుగా ఉంటుందని ప్రొఫెసర్ ఈస్టన్ చెప్పారు. జన్యుపరివర్తన వల్ల మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే శక్తి రాగలదని తెలిపారు. ఇప్పుడు చైనాలో ఇదే జరుగుతోంది. అక్కడ ఒకరి నుంచి ఒకరికి ఇది వ్యాపిస్తోంది.
వ్యాప్తి తీవ్రత ఎంత?
ఇది ఎంత తేలిగ్గా మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తోందో తేలాల్సి ఉంది.
ఉదాహరణకు ఇది వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడిన వారికి వ్యాపిస్తోంటే, దానిని ప్రతిఘటించే స్థితిలో వారి శరీరం లేకపోవడం కారణం కావొచ్చని, ఆరోగ్యవంతులైన వ్యక్తులు దీనిని ప్రతిఘటించే స్థితిలో ఉండొచ్చని ప్రొఫసర్ ఈస్టన్ చెప్పారు. కొన్ని వైరస్‌లు శరవేగంగా, మరికొన్ని చాలా నెమ్మదిగా వ్యాపిస్తాయని, కరోనావైరస్ ఎంత వేగంగా వ్యాపిస్తోందనేది ముఖ్యమైన అంశమని తెలిపారు.
వ్యాప్తి మొదలయ్యాక మనం ఏం చేయాలి?
చాలా సందర్భాల్లో కరోనావైరస్‌లను ఎదుర్కోవడానికి ఔషధ వాడకం పరిష్కారం కాదు. వీటిని విజయవంతంగా ఎదుర్కోగల యాంటీవైరల్ ఔషధాలు చాలా తక్కువని ప్రొఫెసర్ ఈస్టన్ చెప్పారు.
చేతులు కడుక్కోవడం, టిష్యూలు వాడటం లాంటి సాధారణ పరిశుభ్రత చర్యలతో వైరస్ దాడిని నివారించవచ్చని తెలిపారు. సమీప భవిష్యత్తులోనూ దీనికి ఎలాంటి డ్రగ్స్ ఉండవని, అందువల్ల ప్రస్తుతానికి ప్రాథమిక పరిశుభ్రతే దీనిని ఎదుర్కోగల అస్త్రమని చెప్పారు.
వైరస్ దాడి నివారణతోపాటు వైరస్ సోకిన వ్యక్తుల విషయంలో పాలనా యంత్రాంగం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటుందనేది కీలకమైన అంశం.
వైరస్ సోకినవారిని సాధ్యమైనంత త్వరగా గుర్తించి వైద్యసహాయం అందించాలని, ఇన్‌ఫెక్షన్ వ్యాప్తిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ ఈస్టన్ సూచించారు.
గతంలో సార్స్, మెర్స్ వ్యాపించినప్పుడు అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులు అంతర్జాతీయ విధానాలను రూపొందించారు. అప్పట్లో కరోనావైరస్‌ల దాడులు నేర్పిన పాఠాలు ఇప్పుడు వైరస్‌ను ఎదుర్కోవడంలో, దీని ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడతాయని ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగం ఆశిస్తోంది.
Comments
Post a Comment