రాజధానిపై అందిన బీసీజీ నివేదిక ....
తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) ప్రభుత్వానికి శుక్రవారం తమ నివేదిక అందించింది . సీఎం క్యాంపు ఆఫీస్‌లో బీసీజీ సభ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఏపీలో సమతుల్య, సమగ్రాభివృద్ధిపై నివేదిక సమర్పించారు. ఇప్పటికే రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ రిపోర్టుపై మంత్రివర్గం చర్చ పూర్తయిన నేపథ్యంలో బీసీజీ నివేదికలపై చర్చించి, అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోనుంది. హైపవర్ కమిటీ భేటీ అనంతరం రాజధాని అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 6న హైపవర్ కమిటీ భేటీ అయి చర్చించి ఈనెల 20 లోపు ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది.
హైపవర్ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మొత్తం పదిమంది మంత్రులు, సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని పేర్కొంటూ జీఎన్ రావు కమిటీ రెండు వారాల క్రితం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ (శాసన రాజధాని), విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ (పరిపాలన రాజధాని), కర్నూలులో (న్యాయ రాజధాని) జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ సూచించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఈ నిపుణుల కమిటీ 125 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రతిబింబించేలా నివేదికలో పలు కీలక సూచనలు చేసింది.
Comments
Post a Comment