రాజధానికోసం సకలజనుల సమ్మెకు సిద్ధం
అమరావతి: ఏపీ రాజధాని గ్రామాల్లో శుక్రవారం నుంచి సకలజనుల సమ్మెకు జేఏసీ (ఐక్యకార్యాచరణ కమిటీ) పిలుపు ఇచ్చింది.
29 గ్రామాల్లో సకలజనుల సమ్మె చేస్తామని ప్రకటించింది. ఆస్పత్రులు, మందుల దుకాణాలు, పాలసరఫరా మినహా మిగిలినవన్నీ బంద్ అవుతాయని తెలిపింది. మరోవైపు రైతుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిననాటినుంచి రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో రైతులు చేపట్టిన రిలే నిరాహారదీక్ష శుక్రవారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. పెద్ద సంఖ్యలో మహిళలు, రైతులు, రైతు కూలీలు హాజరై నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల నుంచి రైతులు దీక్షా స్థలికి తరలివస్తున్నారు.కమిటీలతో ఒరిగేదేమీలేదని, ఎవరినడిగి జగన్ ఈ కమిటీలు వేస్తున్నారని, మహిళా రైతులు ప్రశ్నించారు. నలుగురు మంత్రులు నానా విధాలుగా మాట్లాడుతున్నారని, తామంతా కలిస్తే ఏమైనా చేయగలమని అన్నారు. తమకిప్పుడు రాజధానిగా అమరావతే కావాలని డిమాండ్ చేస్తున్నారు.
తాము భూములు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చామని, చంద్రబాబుకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రజా వేదికను కూలగొట్టారని, అది ఎవరి సొమ్ము? జగన్‌దా? చంద్రబాబుదా? అని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును అలాగే దుర్వినియోగం చేస్తారా? అని మండిపడ్డారు. ఏదో నాలుగు రోజులు కూర్చొని, విరమిస్తారని అనుకుంటున్నారని, ఆడది తలచుకుంటే ఏమైనా చేయగలదని, ఆదిపరాశక్తని మహిళా రైతులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Comments
Post a Comment