విశాఖలోనే రిపబ్లిక్ డే..వేడుక
విశాఖపట్నం : ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రచారం జరుగుతున్నవిశాఖపట్నంలోనే జనవరి 26వ తేదీన గణతంత్ర వేడుకలు (రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్) నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఒకవైపు అమరావతి ప్రాంతంలో ఆందోళనలు పతాకస్థాయికి చేరుతున్న నేపధ్యంలో ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
విశాఖపట్నంలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గణతంత్ర వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రిపబ్లిక్ డే ప్రసంగాన్ని వెలువరిస్తారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక తొలిసారి జరుగుతున్న గణతంత్ర వేడుకలు, దానికి తోడు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను అనధికారికంగా ప్రకటించిన తర్వాత జరగనున్న తొలి ఉత్సవాలు కావడంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఎక్కువ సమయం విశాఖపట్నంలో సౌకర్యాలు, సమస్యలపైనే ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగానే విశాఖ నగరంలోనే ఈసారి గణతంత్ర వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
Comments
Post a Comment