48 గంటల మన్యం బంద్ సంపూర్ణం..


స్టంభించిన జనజీవనం... అరకు, లంబసింగిలో కానరాని పర్యాటకుల తాకిడి...


చింతపల్లి, పాడేరు, అరకు (జనహృదయం): గిరిజన చట్టాలు హక్కులు పటిష్టవంతంగా అమలు  చేయడమే ప్రధాన లక్ష్యంగా గిరిజన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపునిచ్చిన 48 గంటల బంద్‌ విశాఖ మన్యంలో విజయవంతంగా ముగిసింది.  తొలి రోజు పూర్తిగా విజయవంతంగా ప్రశాంతంగా జరగగా రెండో రోజు కూడా అదే తరహాలో ముమ్మరంగా సాగింది. ఏజెన్సీ 11 మండలాల్లో అన్ని గ్రామాల్లో బంద్‌ వాతావరణం స్పష్టంగా కనిపించింది మునూపెన్నడూ లేని విదంగా చింతపల్లి, పాడేరు, అరకు వంటి ప్రధాన కేంద్రాలతో పాటు అన్ని గ్రామాలలోను వ్యాపార సముదాయాలు పాఠశాలలు బ్యాంకులు మూతపడ్డాయి ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో జరగాల్సిన వారపు సంతలు రద్దయ్యాయి. బంద్‌ సందర్భంగా ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.



గిరిజన నాయకులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేస్తూ రాత్రింబవళ్ళు రహదారి పైనే ఉండి వంటావార్పు కార్యక్రమాలు  నిర్వహించారు కనీవినీ ఎరుగని రీతిలో మన్యం బంద్‌ విజయవంతంగా జరింగింది. గత రెండు రోజులుగా కనీసం పాల పేకెట్‌ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ, ప్రయివేటు వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.  బంద్‌ సందర్భంగా ఉద్యోగులు, వ్యాపార సంస్థలు స్వచ్చందంగా బంద్‌ పాటిచాయి. ఏజెన్సీ వ్యాప్తంగా 11 మండలాల పరిధిలో గిరిజన సంఘ నాయకులు బంద్‌కు పిలుపునివ్వగా అన్ని వర్గాల వారు బంద్‌కు సహకరించారు. గిరిజనులు తమ హక్కులను కాపాడుకోవడంలో బాగంగా ఈ బంద్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు.



మన్యం బంద్‌ విజయవంతం చేసేందుకు గిరిజన జాయింట్‌ యాక్షన్‌ కమిటి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నుంచి రహదారులపై బైటాయించి అక్కేడే వంటావార్పు, బోజనాలు, నిద్ర చేపట్టగా వినూత్న వేషధారణతో ఆటాపాటా, దింసా నృత్యాలు, ర్యాలీలు నిర్వహించారు. చిన్నా, పెద్దా, ఆడా, మగా తేడాలేకుండా జై ఆదివాసీ నినాదంతో ముందుకు సాగారు. ఉద్యోగులు, కార్మికులు, యువత ఏకతాటిపైకి చేరారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని ప్రధానంగా డిమాండ్‌ చేశారు. అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అన్ని కేవలం గిరిజనులకే కేటాయించాలని గిరిజనేతరులకు పోటీ చేసే హక్కు కల్పించవద్దంటూ డిమాండ్‌ చేశారు. ఈ బంద్‌కు మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ తమ మద్దతు ప్రకటించగా, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి గిరిజన హక్కులకు భంగం కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.



కాగా గిరిజనులు చేపట్టిన బంద్‌కు ఏజన్సీ వ్యాప్తంగా వ్యాపారాలు చేస్తు జీవనం గడుపుకుంటున్న గిరిజనేతరులంతా స్వచ్చందంగా బంద్‌కు సహకరించి వ్యాపార లావాదేవీలు నిలిపివేసి బంద్‌ విజయవంతం చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఏజన్సీ బంద్‌ సంధర్భంగా పోలీసులు తెల్లవారు జామునుండే ముఖ్య కూడళ్లలో పహారా కాశారు. దీంతో 48 గంటల పాటు సాగిన మన్యం బంద్‌ ప్రశాంతంగా విజయవంతంగా ముగిసింది.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా