పోలీసులకు చిక్కిన లంబసింగి దారి దోపిడీ ముఠా


నర్సీపట్నం : పర్యాటకులు, గంజాయి స్మగ్లర్లు  టార్గెట్‌గా చేసుకొని దారిదోపిడీలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. విశాఖ జిల్లా లంబసింగి ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరగడంతో తమ ఆదాయానికి ఇదే సరైన సమయంగా భావించిన ఓ ముఠా దారిదోపిడీలకు రంగం సిద్దంచేసుకొంది. పనిలో పనిగా గంజాయి రవాణా చేసేవారి నుంచి పోలీసుల ముసుగులో డబ్బు గుంజే ప్రయత్నం చేస్తూ లంబసింగి పర్యటన భయానకంగా చేసిన దోపిడీ ముఠాను పోలీసులు చాకచక్యంగా వ్యవహిరించి కటకటాలకు పంపారు. దీంతో పర్యాటకులకు కాస్త ఉపశమనం దొరికినట్లయింది.   గత నెల 16న పర్యాటక ప్రాంతమైన లంబసింగి విహారయాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణంలో దారి దోపిడీ దొంగలకు చిక్కి వారి దగ్గర ఉన్న డబ్బులను కోల్పోయి వారి చేసిన చిత్రహింసలకు గురై నలుగురు యువకులు పోలీసులను ఆశ్రయించారు. వారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఎనిమిది మందిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో సంచలనం కలిగించిన లంబసింగి పర్యాటకుల దారి దోపిడీ కేసును నర్సీపట్నం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఎనిమిది మంది యువకులను శనివారం అరెస్టు చేశారు. 


జిల్లలో సంచలనం సృష్టించిన ఈ  కేసు వివరాలను ఏఎస్పీ రిషాంత్‌ రెడ్డి విలేకర్లకు అందించిన వివరాలిలాఉన్నాయి.  దారి దోపిడీకి పాల్పడుతున్న ఎనిమిది మంది యువకులు వీరిలో ముగ్గురు నర్సీపట్నం, ముగ్గురు పెదబొడ్డేపల్లి, ఒకరు చింతపల్లి మండలం తురబాల గెడ్డ, మరొకరు గొలుగొండ మండలం ఏటిగైరంపేటకు చెందిన వారని వివరించారు. దర్యాప్తు కొనసాగుతున్నందున  నిందితుల పేర్లు వెల్లడించడం లేదని స్పష్టం చేశారు. మచిలీపట్నానికి చెందిన హితేష్‌, దినేష్‌, భార్గవ్‌, గోపీచంద్‌ డిసెంబరు 16నఅతిశీతల ప్రదేశం లంబసింగి చూడ్డానికి సొంతకారులో వచ్చారు. తిరుగు ప్రయాణంలో తుని వైపు వెళుతున్నప్పుడు నిందితులు బైకులపై వచ్చి అడ్డగించి పోలీస్‌ స్టేషనుకు రమ్మంటూ కారుని దారి మళ్లించారు. బయ్యపురెడ్డిపాలెం వంతెన పక్క నుంచి కశిమిరోడ్లో దాదాపు మూడున్నర కిలోమీటర్లు లోపలకు తీసుకుపోయారు. పర్యాటకులను కత్తితో బెదిరించి, కర్రలతో కొట్టారు. పర్యాటకుల సెల్‌ఫోన్లు లాక్కున్నారు. ఫోన్‌ పే ద్వారా రూ. 6,300 మళ్లించుకున్నారు. వారి దగ్గరున్న రూ.5100 నగదు తీసుకున్నారు. అందరినీ కొట్టి పర్యాటకులకు చెందిన కారుతోనే పరారయ్యారు. శనివారం పోలీసులు నర్సీపట్నానికి సమీపంలోని నెల్లిమెట్ట వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు ఈ నిందితులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పట్టుకొని విచారిస్తే దోపిడీకి పాల్పడిన నిందితులు వీరేనని గుర్తించారు. నర్సీపట్నంలో కొంతమంది యువకులు ఏజెన్సీ నుంచి గంజాయితో వస్తున్న వాహనాలను వెంటపడి అడ్డగించడం, డబ్బులు డిమాండ్‌ చేయడం జరుగుతోందన్నారు. నిందితుల్లో కొందరు పాత కేసుల్లో ఉన్నారని తెలిపారు. వీరి నుంచి ఐదు చరవాణులు, కత్తి, నాలుగు బైకులు, పర్యాటకుల కారు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 


 ఈ కేసుని ఛేదించడంలో సీఐ స్వామినాయుడు, ఎస్సైలు కె.లక్ష్మణరావు, టి.శ్రీను, సూర్యప్రకాశ్‌, క్రైం సిబ్బంది కృషిచేశారని అభినందించారు. నర్సీపట్నంలో రౌడీయిజాన్ని అరికట్టేందుకు గట్టిచర్యలు తీసుకుంటామని, రౌడీలను కట్టడి చేస్తామన్నారు. రౌడీయిజం మానుకోవాలని హెచ్చరించారు. ఆరుగురు రౌడీలు సమస్యాత్మకంగా ఉన్నారన్నారు. అవసరమైతే పీడీ చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దోపిడీ కేసులో మరికొందరి పాత్రపైనా సమాచారం ఉందన్నారు. దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఏఎస్పీ తెలిపారు. ఈ కేసులో పట్టుబడిన కొందరు యువకులకు గతంలో నేర స్వభావం లేదన్నారు. రౌడీల వెనుక వెళ్లి కేసులో ఇరుక్కున్నారని ఏఎస్పీ తెలిపారు.


Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా