రాజధాని రైతులకు జనసేన మద్దతు
మంగళగిరి : రాజధాని రైతుల ఆందోళనలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంఘీభావం తెలపనున్నారు. ఈ మేరకు రేపు ఉదయం మందడం, వెలగపూడి, తుళ్లూరులో.. పర్యటించాలని నిర్ణయించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో పవన్ ఈమేరకు నిర్ణయించారు. అమరావతిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై నాదెండ్ల మనోహర్, నాగబాబు పవన్ కు 20 పేజీల నివేదిక అందజేశారు. వివిధ జిల్లాల్లో ప్రజల అభిప్రాయాలను నేతల నుంచి ఆరా తీస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల పాట పాడుతున్న ప్రభుత్వం రెవిన్యూ లోటు ఎలా భర్తీ చేస్తుందని పవన్ కు ఇచ్చిన నివేదికలో ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల తరలింపు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని తేల్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ, వ్యయాలు పరిశీలిస్తే ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. 22వేల 112 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బ్యాంకులు కూడా రుణాలిచ్చేందుకు ముందుకు రావడం లేదని అభిప్రాయపడ్డారు.3 రాజధానుల చర్చతో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్న పవన్... అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలనేది జనసేన విధానమని స్పష్టం చేశారు. ఒకరికి న్యాయం చేసి, మరొకరికి అన్యాయం చేయాలని ఎవరూ కోరుకోరన్నారు.
Comments
Post a Comment