ఇళ్లపట్టాల పంపిణీకి సిద్ధం కావాలి ..కలెక్టర్ వినయచంద్
విశాఖపట్నం : ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, డి టి లు, ఇతర అధికారులతో ఇళ్ల పట్టాల పంపిణీ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన మార్చి 25 న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించడానికి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ జనవరి ఒకటవ తేదీన విశాఖపట్నం రానున్నారని తెలిపారు. ఆరోజు ఆయన మండలాలలో పర్యటించి కార్యక్రమం ప్రగతిపై విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. గ్రామ పంచాయతీల్లో ని లబ్ధిదారులకు ఆ గ్రామ పరిధిలోనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలిపారు. సచివాలయం లోనూ అర్హుల, అనర్హుల జాబితాలను, అర్హత ప్రమాణాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేని తరుణంలోనే, భూసేకరణ చేయాలని తెలిపారు. అన్ని గ్రామాలలో గుర్తించిన ప్రభుత్వ భూముల లో లేఅవుట్ వేసి, ప్లాట్లు సిద్ధం చేయాలని తెలిపారు. అలసత్వం లేకుండా పూర్తి శ్రద్ధతో పని చేయకపోతే, దాని వలన కలిగే పరిణామాలకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలోని అర్బన్ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నప్పుడు లబ్ధిదారుల గుర్తింపు లో అవకతవకలు, అక్రమాలు జరగకుండా పకడ్బందీగా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ జి. సృజన, జాయింట్ కలెక్టర్లు ఎల్. శివ శంకర్, ఎం. వేణుగోపాల్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, డిఆర్ఓ ఎం. శ్రీదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Post a Comment