సూర్య గ్రహణం తో మూతపడ్డ తిరుమల దేవాలయం
తిరుమల: సంపూర్ణ సూర్యగ్రహణం గురువారం రానున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని 13 గంటల పాటు మూసివేస్తారు. బుధవారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు మూసివేశారు. తిరిగి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీవారి ఆలయం తలుపులు తెరుస్తారు.
అనంతరం ఆలయ శుద్ధి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇదిలా ఉండగా తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. గ్రహణం కారణంగా శ్రీవారి దర్శనాలు నిలిపివేస్తుండటంతో బుధవారం తిరుమలకు వచ్చిన భక్తులను ఉదయం 7 నుంచే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి అనుమతించకుండా అధికారులు నిలిపివేశారు. అయితే అప్పటికే వైకుంఠం కాంప్లెక్స్ పూర్తిగా భక్తులతో నిండిపోవడంతో రాత్రి 11 గంటలలోపు వారందరికీ దర్శనం కల్పించేందుకు టీటీడీ అధికారులు ఈ చర్యలు చేపట్టారు.
కాగా సూర్యగ్రహణం కారణంగా
గురువారం ఉదయం వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దుచేసింది. గురువారం ఉదయం 8.08 గంటల నుంచి 11.16 గంటల వరకు సూర్యగ్రహణ కాలం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం 6 గంటలు ముందుగా శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 11 గంటలకు ఆలయం మూసివేశారు. బుధవారం తిరుమలకు చేరుకున్న భక్తులకు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం శుద్ధి అనంతరం వైకుంఠం కాంప్లెక్స్‌కు అనుమతిస్తారు. బుధవారం రాత్రి 10గంటల నుంచి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాల కాంప్లెక్స్ తలుపులను కూడా మూసివేశారు.
గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద భవనాన్ని తెరచి వంట శాలను శుద్ధిచేసి మధ్యాహ్నం 2 గంటలకు అన్నప్రసాద వితరణ ప్రారంభిస్తారు. సూర్యగ్రహణం కారణంగా గురువారం శ్రీవారి ఆలయంలో నిర్వహించే తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవ సేవలను కూడా టీటీడీ రద్దుచేసింది.
Comments
Post a Comment