మహారాష్ట్రలో తమకే బలం ... శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ
162 మంది ఎమ్మెల్యేలు తమతోనే...
మంగళవారం ఉదయానికి వాయిదా పడ్డ సుప్రీం తీర్పు...
ముంబాయి (జనహృదయం) : మహారాష్ట్ర అధికారం పీఠం దక్కించుకునేందుకు ఎవరి వ్యూహాలతో వారు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బలపరీక్షకు సిద్దమౌతుండగా, రాజ్యాంగ విరుద్దంగా ఏర్పడ్డ పడ్నవీస్ ప్రభుత్వాన్ని వెంటనే బలపరీక్షకు ఆదేశించి వారు విఫలమైతే తమను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిందిగా తమతో 162 మంది ఎమ్మేల్యేల మద్దతు తమకే ఉందని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది. అత్యంత ఉత్కంఠ భరితంగా ఏర్పడ్డ మహా ప్రభుత్వ ఏర్పాటు, పదవీ ప్రమాణం చేసిన పడ్నవీస్ ప్రభుత్వం విశ్వాసపరీక్ష నెగ్గుకొస్తుందా? అనే విషయాలు ఏక్షణం ఏ మలుపు తిరుగుతాయోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుప్రీం కోర్టులో ఈమేరకు ఇరువర్గాల వాదనలు విన్న తరువాత తీర్పును మంగళవారం ఉదయానికి వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే తమవద్ద 162 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారంటూ ముంబైలో గ్రాండ్ హయత్ హోటల్‌లో పరేడ్ నిర్వహించాయి. ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకే తమ ప్రయత్నం అంటూ ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళన చేశారు. తమ పక్షాన ఉన్న 162 మంది ఎమ్మెల్యేలను బస్సుల్లో తరలించి బలాన్ని చాటుకున్నారు. ఈమేరకు గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించారు. కాగా బలపరీక్ష శాసనసభలోనే జరగాల్సి ఉండగా, గవర్నర్‌కు తమ బలం తెలియజేసేందుకే హయత్ హోటల్‌లో తమ బలం చూపి గవర్నర్ వద్ద ఇటు ప్రజల్లోను విశ్వాసం సాధించేందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి.
కాగా ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్ పవార్‌లు చెరోవైపు నిలువగా చివరివరకూ వీరి అడుగులు ఇలానే ఉంటాయా? లేక బిజేపి వైపు మొగ్గుచూపుతారా? అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మహాడ్రామా మరికొన్ని రోజులలో ముగియ నున్న నేపథ్యంలో ప్రతిక్షణం ఉత్కంఠ భరితంగా సాగుతోంది.
Comments
Post a Comment