పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్ ….



విజయనగరం (జనహృదయం):  అసంపూర్తిగా నిలిచిపోయిన పూర్ణపాడు – లాబేసు వంతెన నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి చొరవతో ఈ వంతెన నిర్మాణానికి సంబంధించిన ఈఓఏటి గడువును రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్ 30 వతేదీ వరకూ పొడగిస్తూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఇప్పట్లో పూర్తవదనుకున్న పూర్ణపాడు – లాబేసు వంతెన నిర్మాణం మరో ఏడు నెలల్లో పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడింది.




కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలోని కొమరాడ మండలంలో మొత్తం 31 పంచాయితీలు ఉండగా వాటిలో 22 పంచాయితీలు నాగావళి నదికి ఒకవైపున ఉండగా, మరో 9 పంచాయతీలు నదికి మరోవైపున ఉన్నాయి. అయితే నాగావళి నదిపై వంతెన లేనికారణంగా 9 పంచాయతీలకు చెందిన ప్రజలు మండల కేంద్రమైన కొమరాడ కు రావాలన్నా, 22 పంచాయతీలకు చెందిన గ్రామస్తులు నియోజకవర్గకేంద్రమైన కురుపాం కు చేరుకోవాలన్నా చుట్టూతిరిగి రావాల్సి ఉంటుంది. పార్వతీపురం మీదుగా చుట్టుతిరిగి రావడానికి సుమారు అరవై కిలోమీటర్ల దాకా ప్రజలు ప్రయాణించాల్సివస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో అయితే నాగావళి నదిపై పూర్ణపాడు-లాబేసు గ్రామాలమధ్యన వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. మొదట నిర్ణయించిన గడువు ప్రకారంగా 2017 మే 24వ తేదీలోపుగా ఈ వంతెన నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా అనుకున్న సమయానికి వంతెన నిర్మాణం పలు కారణాలతో పూర్తి కాలేదు. ఆ తర్వాత వంతెన నిర్మాణ గడువు ( ఎక్స్ టెన్షన్ ఆఫ్ అగ్రిమెంట్ టైం- ఈఓఏటి) ని గత 2018 జూలై నాటికి పొడిగించారు. అయితే ప్రాధాన్యత కలిగిన వంతెన నిర్మాణాన్ని టిడిపి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, పనుల్లో జాప్యం కారణంగా పెరిగిన అంచనా వ్యయాన్ని గురించి పట్టించుకోకపోవడంతో పూర్ణపాడు – లాబేసు వంతెన నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ పరిస్థితుల్లోనే ఈనెల 5వ తేదీన డిప్యుటీ సిఎం పుష్ప శ్రీవాణి అర్ధాంతరంగా ఆగిపోయిన ఈ వంతెనను సందర్శించి, జరుగుతున్న ఆలస్యానికి కారణాలేమిటని ఆరా తీసారు. నిర్మాణంలో జరిగిన ఆలస్యం కారణంగా రూ. 10 కోట్ల అంచనాతో మొదలైన ఈ వంతెన నిర్మాణ వ్యయం రూ. 14 కోట్లకు చేరిందని, దీనికి అవసరమైన అదనపు నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అలాగే వంతెన నిర్మాణ ఒప్పంద గడువు (ఈఓఏటి)ను కూడా పొడిగించాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఈ సందర్భగానే పంచాయితీరాజ్ అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. అయితే నిధుల మంజూరులో జాప్యం కారణంగా కూడా వంతెన నిర్మాణంలో ఆలస్యం జరగడానికి వీల్లేదని, ఎక్కువగా గిరిజన ప్రాంతాల ప్రజలకు మేలుచేసే ఈ వంతెన నిర్మాణానికి కావాల్సిన రూ.4 కోట్ల అదనపు నిధులను ట్రైబల్ సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయిస్తామని, రాబోయే నోడల్ ఏజెన్సీ సమావేశంలోనే దీనికి అనుమతిని తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వం ఈఓఏటి గడువును కూడా పెంచేలా చూస్తామని కూడా హామీ ఇచ్చారు. నిలిపి వేసిన వంతెన పనులను మళ్లీ ప్రారంభించాలని,ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వంతెన నిర్మాణం వచ్చే ఏడాది జూన్ మాసం లోపుగా పూర్తిచేయాలని అధికారులను మంత్రి  ఆదేశించారు.  దీంతో ఇప్పటి దాకా నిలిచిపోయిన ఈ వంతెన నిర్మాణం మళ్లీ మొదలుకానుంది. అలాగే గతంలో తాను హామీ ఇచ్చిన విధంగానే ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన అదనపు నిధులను కూడా మంజూరు చేస్తామని, వచ్చే జూన్ 30 వతేదీ నాటికి పూర్ణపాడు – లాబేసు వంతెన నిర్మాణం పూర్తయ్యేలా చూస్తామని ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మరోసారి హామీ ఇచ్చారు.



Comments

Popular posts from this blog

కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఘనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు జిల్లా