హత్య కేసులో మిస్టరీని చేదించిన పోలీస్...
చింతపల్లి (జనహృదయం): హత్య కేసు మిస్టరీని ఛేదించి తమ సత్తా చాటుకున్నారు చింతపల్లి పోలీసులు. ఈనెల 9న లంబసింగి ఘాట్ లో జరిగిన హత్యలో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ మేరకు చింతపల్లి సిఐ సన్యాసిరావు ఎస్ఐ పాపి నాయుడు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇద్దరు పాత నేరస్తులు దోచుకున్న సొమ్ము లో తేడాలు రావడంతో వారి మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. ఎలమంచిలి మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన బొద్ధపు బాబురావు, చల్ల రామ్ మోహన్ రెడ్డి గత కొంతకాలంగా అనకాపల్లి, ఎలమంచిలి పరిసర ప్రాంతాల్లో పలు నేరాల్లో పాల్గొన్నారు. దీని ద్వారా వచ్చిన సొమ్ము బాబురావు మోహన్ రెడ్డికి ఇచ్చేందుకు నిరాకరించడంతో మోహన్ రావు తన చిన్నాన్న అయిన రాఘవేంద్రరావు సహాయంతో బాబురావును హత్య చేసేందుకు పథకం రూపొందించారు. దీంతో ఈనెల 9న నర్సీపట్నానికి చెందిన మరో నలుగురు యువకులతో కలిసి కసింకోట సమీపంలో ఉన్న బాబు రావుని పట్టుకొని చావబాదారు. అపస్మారక స్థితికి చేరుకున్న బాబురావును నర్సీపట్నం నుండి తమతో తీసుకు వెళ్లిన అద్దె కారు లో వేసి లంబసింగి ఘాట్ కి ప్రయాణమయ్యారు. నర్సీపట్నంలో నలుగురు యువకులు దిగి పోగా రాఘవేంద్ర రావు మరియు రాహు రామ్మోహన్రెడ్డి అపస్మారక స్థితిలో ఉన్న బాబురావు తీసుకొచ్చి కాఫీ తోటల వద్ద పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. అనంతరం చింతపల్లి మీదుగా పెదవలస వెళ్లి నర్సీపట్నం వైపు వెళ్లిపోయారు. ఈ మేరకు కాఫీ తోటల్లో పనిచేస్తున్న వారు చింతపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సిసి కెమెరా సహాయంతో కారును గుర్తించి కారు నెంబర్ ద్వారా కారు యజమాని పట్టుకొని ఆరా తీయడంతో విషయం బయటికి వచ్చింది. ఈ మేరకు కారును స్వాధీనం చేసుకొని కార్లో ప్రయాణించి ఈ హత్యకు సహకరించిన నిందితులు కే దుర్గాప్రసాద్, పి సురేష్, సత్య మణికంఠ, హర్ష సిద్దులను శుక్రవారం అరెస్ట్ చేశారు. కాగా ఈ హత్యకు పథకం రూపొందించిన ప్రధాన నిందితుడు రామ్మోహన్రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలియజేశారు.
Comments
Post a Comment