ప్రమాదానికి గురైన యువతికి అండగా...
బాధితురాలికి ఉద్యోగం కల్పిస్తామని హామీ
26 న కేర్ ఆస్పత్రిలో బాధితురాలికి ఆపరేషన్
అనంతపురం : రోడ్డు ప్రమాదంలో గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ యువతికి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి అండగా నిలిచారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మాట్లాడి తక్షణం యువతికి వైద్య చికిత్స జరిగేలా చొరవ తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని ఆజాద్‌నగర్‌లో నివాసముంటున్న పి.అబ్దుల్ అజీం (పెయింటర్), పి.షాహిదా దంపతుల కుమార్తె పి.ఖతిజతుల్ కుబ్రా బి.టెక్ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు చేరుకుని కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. గత శనివారం ఓ ఇంటర్వ్యూకు హాజరవగా ఉద్యోగానికి ఎంపికైంది. ఈ సంతోషకమైన విషయాన్ని అనంతపురంలో ఉన్న తన తండ్రికి సెల్‌ఫోన్‌లో చెబుతున్న సమయంలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులకు హైదరాబాద్ చేరుకున్నారు. గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రిలో కుబ్రా చికిత్స కోసం రూ.లక్షకు పైగా ఖర్చు అయ్యింది. అయితే కుబ్రా వెన్నెముక తీవ్రంగా దెబ్బతినడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఇందుకోసం సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. అసలే పేదరికంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు ప్రాథమిక వైద్యం కోసమే ఉన్న డబ్బులను ఖర్చు చేసేశారు. దీంతో వాళ్లకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి వెంటనే స్పందించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు సమాచారం ఇచ్చి తక్షణం వైద్యానికి చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో వెంటనే సీఎంఓ అధికారులు సదరు ఆస్పత్రికి యువతి వైద్యానికి సంబంధించి ఎల్‌ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పంపారు. యువతి ఆపరేషన్‌కు ఎంత ఖర్చయినా భరిస్తామని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలియజేశారు. అంతేకాకుండా యువతి ఆరోగ్యం కోలుకున్నాక ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని సీఎంఓ అధికారులు బాధిత కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లు చెప్పారు. ఇదిలావుండగా కుబ్రాకు మంగళవారం ఆపరేషన్ చేస్తారని ఆమె సోదరుడు ఖలీఖ్ తెలిపారు. సీఎంఓ తరఫున కొందరు సోమవారం మధ్యాహ్నం కేర్ ఆస్పత్రికి వచ్చి మాట్లాడినట్లు తెలిపారు.
Comments
Post a Comment