ఉగాదికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ళస్థలాలు...
గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు
పట్టణప్రాంతాల్లోని పేదలకు 2,58,648 గృహాలు మంజూరు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో కేంద్రం ద్వారా 3,83,272 ఇళ్లు మంజూరు చేయించాం.
అమరావతి : ఉగాది నాటికి కులం, మతం, జాతి వివక్ష అన్నది లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ సంతృప్తస్థాయిలో ఇళ్లు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్ లో ఉన్న ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారన్నారు. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల జాబితాలను రూపొందించడం జరిగిందని అన్నారు. నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రానున్న నాలుగేళ్లలో 25 లక్షల పక్కాగృహాలను కూడా నిర్మించి ఇస్తామని తెలిపారు. ఇప్పటికే పేదలకు ఇచ్చే భూమిని సేకరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రితో కలిసి 7 జిల్లాల్లో భూసేకరణ కోసం సమీక్షలు కూడా చేశామన్నారు. త్వరలోనే మిగిలిన 6 జిల్లాల్లో కూడా పర్యటించి, భూసేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. కేంద్రం నుంచి గతంలో 1.40 లక్షల ఇళ్ళు మంజూరు అయ్యాయని, ఈ రోజు మరో 2.58 లక్షల ఇళ్లు కేంద్రం ద్వారా తీసుకురావడం జరిగిందని అన్నారు. మొత్తం సుమారు 3.80 లక్షల ఇళ్ళ నిర్మాణానికి డిపిఆర్ పూర్తి అయ్యిందని మంత్రి వెల్లడించారు. మరో 4 లక్షల ఇళ్లు కూడా రాష్ట్రానికి కేటాయించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని తెలిపారు.
Comments
Post a Comment