వైఎస్సార్ వాహనమిత్ర తో 2లక్షల 36వేల మందికి లబ్ది...
• మొదటి విడతలో లక్షా 73వేల 102 మందికి లబ్ది
• రెండవ విడతలో 62వేల 637 మంది వాహన దారులకు లబ్ది
• ఈ పథకం కింద ఈఏడాది రూ. 236 కోట్లు ఖర్చు చేయనున్నాం
అమరావతి (జనహృదయం) : రాష్ట్రంలో వైఎస్సార్ వాహనమిత్ర పథకం ద్వారా ఈ ఏడాది రెండు విడతల్లో మొత్తం 2లక్షల 36వేల 343 మంది వాహనదారులకు లబ్ది కలిగించడం జరుగుతోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణాశాఖా మాత్యులు పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీమేరకు తెల్లరేషన్ కార్డు కలిగిన ఆటోలు, టాక్సీ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్స్ యజమాని కం డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ మరియు వాహన మరమ్మత్తుల నిమిత్తం 10వేల రూ.లు వంతున ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రవేశపెట్టిన తొలి సంక్షేమ పథకం వైఎస్సార్ వాహనమిత్ర పథకమని పేర్కొన్నారు. ఈ పథకం అమలుకై గత సెప్టెంబరులో జిఓ నంబరు 34,38ల ద్వారా విధివిధానాలను జారీ చేసి ఏలూరులో దీని అమలుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఈ పథకం అమలుకు 400కోట్ల రూ.లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేయగా మొదటి విడతలో లక్షా 73వేల 102మందికి 10వేల రూ.లు వంతున ఆయా వాహన దారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా రెండవ విడతగా మరో 62వేల 637మందికి ఈమీడియా సమావేశం నుండే వారి బ్యాంకు ఖాతాలకు ఆన్ లైన్ ద్వారా నిధులు జమ చేశారు. కాగా వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద మొదటి విడతలో మొత్తం లక్షా 72 వేల 102 మందికి లబ్ది కలిగించగా వారిలో 39 వేల 805 మంది ఎస్సిలు, 6 వేల 23 మంది ఎస్టిలు, 79వేల 21మంది బిసిలు, 17 వేల 504 మంది మైనార్టీలు, 20 వేల357 మంది కాపు, 397మంది బ్రాహ్మణులు, 9 వేల 995 మంది ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన వారు లబ్ది పొందడం జరిగిందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. రెండవ విడతలో భాగంగా అందిన దరఖాస్తుల్లో 62వేల 637 మంది అర్హులుగా గుర్తించగా వారిలో 14వేల 528 ఎస్సి, 2వేల714 ఎస్టి, 26వేల 696 బిసి, 8వేల 196 మైనార్టీ, 6వేల 661కాపు,112 బ్రాహ్మణ, 3వేల 487 ఇబిసి, 245 క్రిస్టియన్ మైనార్టీ వర్గాలకు చెందిన వారికి 10వేల రూ.లు వంతున వారి బ్యాంకు ఖాతాలకు నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద రెండు విడతల్లో మొత్తం 2లక్షల 36వేల 343 మంది వాహన దారులకు ప్రయోజనం కలిగించేందుకు ఈఏడాది ఇప్పటికే 236కోట్ల రూ.లు వారి ఖాతాలకు జమచేయడం జరిగిందని చెప్పారు.ఇంకా అర్హులైన వారందరికీ ఈ పథకం కింద లబ్ది కలగించేందుకు వచ్చే ఏడాది కూడా ఈ పథకాన్ని కొనసాగించడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ వైఎస్సార్ వాహనమిత్ర పథకాన్ని తీసుకవచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి పేర్నినాని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే రవాణా శాఖకు చెందిన మోటర్ వాహన ఇన్స్పెక్టర్ మొదలు ముఖ్య కార్యదర్శి వరకూ జిల్లా కలెక్టర్లు, ఎండిఓలు, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పథకం విజయవంతానికి ఎంతో బాగా పనిచేశారని వారందరికీ ప్రభుత్వం తరుపున ప్రత్యేక అభినందలు తెలియజేస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, రవాణాశాఖ కమీషనర్ టిఎస్ఆర్ ఆంజనేయులు, ఆ శాఖ సంయుక్త కమిషనర్లు ఎస్ ప్రసాద రావు, జె.రమాశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment